Tuesday, August 24, 2010

America Viseshalu - Part 1

మా అమ్మమ్మనో ఎవరో అడిగినరు ఒక సారి..

"అమెరికా లో బిచ్చపు వాండ్లు కూడా ఇంగ్లీషు లో మాట్లాడుతరట కదా?!!"

అని. అవును మరి.. వాండ్లకు "అమ్మా.. తల్లే..ఇంత బువ్వుంటే ఎయ్యమ్మో" అనడం నేర్పించాలె మనమే. లేకపోతే ఆ ఫీలింగ్ రాదు. రాకపోవడమే మంచిదేమో.. మనం బిచ్చం ఎయ్యల్సిన అవసరం లేదు. ఫీలింగ్ తెప్పించేందుకు వేరే పద్ధతులు తెలుసు లే వాండ్లకు కూడ. అడగడం ఒక పధ్ధతి. తీసుకోవడం ఇంకో పధ్ధతి. అంటే దాంట్లో కూడ అడిగి తీసుకోవడం, అడగకుండ తీసుకోవడం అని రెండు పద్ధతులు ఉంటయేమో. ఏమో. నాకు తెల్వదు. Suppose.

నాకు ఇవాళ్ళనే ఆఫీసుకు పోయే దారిలో, "ఇక్కడ మనమే ధనికులం లెక్క.. మిగితా వాళ్ళు చూడు, కనీసం కారులో ఏసీ కూడ వేయకుండనే తిరుగుతారు ఈ ఎండలో కూడ" అని చెప్పినరు. చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది. నాకు కూడ ఇంకా సరిగ్గా తెల్వదనుకో.. వచ్చి మూడు రోజులు కూడ కాలేదు, అప్పుడే అభిప్రాయాలు ఏమి ఉంటయి? (ఉండే ఉంటయి లే). అయినా, మన వాండ్లు కూడ కొంత మంది అట్ల ఏసీ లు, తిండ్లు మానేసి, పని చేసి చేసి అలిసి, వచ్చి పండుకోని, మళ్ళ ఆఫీసుకు పోయే వాండ్లు ఉంటరట. నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి వండ్లెవ్వరు కనిపించలేదు లే. అట్ల ఉంటే ఇక్కడ ఉండి లాభం ఏమి? బాగ తినాలె, బాగా పని చేయాలె. అంతేగనీ, తిండి మానేస్తే నీరసం తప్ప ఏమొస్తుంది చెప్పు? ఏమో మరి, వాండ్లకే తెల్వాలె.

మా ఊరిలో ఇంకా ఎండకాలం. ఎండలు తగ్గేందుకు ఇంకో నెలనో ఇంకా ఎక్కువనో పడుతుండట. అప్పటి వరకు పగలైతే కారు వరకు తప్ప ఇంకెక్కడికి నడిచి పోలేము. చచ్చేంత వేడి. నేల నించి సెగలు వస్తుంటయి. ఎండ భగభగ మండడమే కాదు, కండ్లకు కూడ బాగ కొడ్తుంటుంది. అందరు నల్ల కండ్లద్దాలు ఎందుకు పెడ్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. అవి లేకపోతే కండ్లు పోతయి. నావింకా పోలేదనుకో. కారు లేని వాండ్లు అట్ల షికారుకు పొయ్యే ప్రయత్నం చేస్తే జస్ట్ మాడిపోయి వస్తరట. ఏమో మరి. నేనెప్పుడు ప్రయత్నించలే. ప్రయత్నించే ఉద్దేశం కూడ లేదు. నేను కారు కొనే వరకు ఇంకెవరన్న దింపుతరేమో చూస్త. లేకపోతే ఒక సైకిల్ కొని నడిపిస్త. (ముందైతే నీ జీతం రనీ రా.. అప్పుడు చూతం కానీ సైకిల్ సంగతి..)

ప్రస్తుతం ఇక్కడి విశేషాలు ఇవే. మళ్ళ ఏమన్నుంటే చెప్త. టాటా.